తొలి చూపులో రమించాను మృత్యువుని
నెత్తుటి వానలో
కాయపు చూరుకింద
కాయితప్పడవల్నొదిలాను
తుది నొప్పులే తొలి ముద్దులు
కాలం కొరుకుతున్న చలిలో వణుకు
చిలికి చిలికి చీకటి వాన
నీలి మైకపు జడి వాన
***
ఎముకలు కౌగిలించుకుంటున్నవి
నీ మాంసాన్నీ
నీ కండరాల్నీ-
నా తలుపు మూసుకుంటున్నప్పుడు
దూకెయ్యనా నీ
మాంసం తొలుచుకొని-
నాలాంటి కోరలు లేని
ఎవరో పళ్ళు పీకేసిన
సాదు మృగమా!
మంచి జంతువా!
నాలాంటి మనిషీ!
మృత్యువుని తోసుకొని గెంతినవాడు
బాల్యంలో కూలబడతాడు
నీ శైశవాత్మ కావాలిరా, శిశుమానస చిత్రాంగం కావాలి
ఎక్కడో ఎవరో మరణిస్తున్నప్పుడు
జీవించాను
ఎవరో జన్మిస్తున్నందుకు మరణిస్తాను
శూన్యపు ద్వారం
కిటికీలు లేని ద్వారం
తెరిచే వుంది నీకోసం
నాకోసం-
మరణిస్తావా నాకోసం
శైశవంలో కలవడానికి
రెండు నీలి శూన్యపు పాలిండ్లు
పాలుగారుతున్నవి సూర్యకాంతితో
ఒకరి బొడ్డునొకరం కోసుకుందాం
చిట్టి చేతుల్తో, ఉమ్మ నోటితో-
గుసగుసలుగా అరుద్దాం
భాషల్లేకుండా మాట్లాడుదాం
నువ్వూ నేనూ ఒకే గర్భంలో
సహస్ర నామాలై
శతసహస్ర రూపాలై-
-అయిల సైదాచారి
No comments:
Post a Comment