Powered By Blogger

Thursday, January 27, 2011

కట్టుకున్నాక...


"ఇక్కడ నీకోసమేమీ లేదు
రొండు రొట్టెలు తెచ్చుకో ఆకలేస్తే
కొన్ని కట్టెలు తెచ్చుకో నీకు చితి పేర్చడానికి"
ఒక స్త్రీ శపిస్తోంది
           మహా శబ్దంతో ప్రేమిస్తూ-
మాంసపు కోర్కెతో రగిలిపోయే
                            శాఖాహార స్త్రీ
ఒక్కర్నే ప్రేమించడానికి శక్తులన్నీ
                            కూడదీసుకుంటూన్నాను
తలపుల్లో ఆ ఒక్కరూ లేనితనాన్నుంచి
                            ఎట్లా వేరు పడాలి?
స్త్రీ నాలుక భయపెడుతుంది
పెదవులూ, వక్షోజాలూ
నడుమూ
నెల నెలా నిర్దయతో ముడుచుకునే
రహస్యాంగమూ భయపెడుతుంది
ఒక్కర్నే ముట్టుకున్నాను
ఒక్కరితో పిల్లల్ని కంటున్నాను
ఒక్కరిలోనే లోకాన్ని చూస్తున్నాను
దారి లేదు
భయమంటే భయం
ద్వేషమంటే భయం
సౌందర్యపు నిర్లక్ష్యంలో గడ్డి పరకను
చదరపు గదుల్లో
గాలి మేడల్లో
సొంతాస్తుల రిజిస్ట్రేషన్ కాగితాల్లో
ఇరుక్కుపోయాను
కట్టుకున్నాక, కన్నాక...

Saturday, January 22, 2011

పాదాలు


అందం ఆరోగ్యం ప్రతిఫలించే పాదాలు
ముఖ్యంగా స్త్రీల పాదాలు
ఏ స్త్రీ కనిపించినా ముందు
            పాదాల్నేచూస్తాను
నా భార్య పొత్తిళ్ళలో
తొలుదొల్త నా బిడ్డను చూసినప్పుడు
            ముందు పాదాలనే చూశాను
సున్నితంగా వేళ్ళతో ముట్టుకున్నప్పుడు
            తెల్లని ముద్రికలై
            వెంటనే నెత్తురు కమ్ముకుంది
నెత్తురు చర్మం లోపల ప్రవహిస్తుందో
చర్మం నెత్తురు బయట ప్రవహిస్తుందో-
 
తెల్లని ఎర్రని ముడుతల పాదాలు
ఈ కఠినాత్మక  లోకంలో అడుగుపెట్టి
కరకుదేలి నెత్తురోడి
తుదకు ముడుతలు పడే పాదాలు-
 
ఒకనాటి కలలో
తొట్టి నీళ్ళలో తేలుతున్న నా బిడ్డ పాదాలని చూశాను
ఏడుపాగదు
ఒట్టి పాదాల్నే చేతుల్లో పెట్టుకొని
కన్నీటిలో తడిసిన కల
చిట్టి వేళ్ళ కల
పూరేకుల స్పర్శలాంటి అరికాళ్ళ కల
గుండ్రని మడమల కల
 
నా పదేళ్ళ బిడ్డ
తనవైన తన సొంత పాదాలతో
నడవడం నాకెంత గర్వం!
నిద్రలో ఆమె పాదాల్ని ముద్దాడి
                        నుదుటికి హత్తుకుంటాను
ఒక దేవతకు నమస్కరించినట్టు-

ధ్యాన కాంతి



పట్టపగలు తాగటం ఇష్టం
సూర్యుడు మేలుకొన్న కాలాల్లో తాగినప్పుడు
లోకంలోని ఆకుపచ్చదనమంతా
నా లోపలికి ప్రవహిస్తుంది
లోకంలోకీ నాలోకీ
లోలకంలా ఊగుతున్న చూపు
అటు లోకంలోనూ నాలోనూ స్థిరపడుతుంది
 
చీకటైన జీవితం
చీకట్లో దాచుకున్న జీవితం
జ్ఞాపకమై వెలుగుతుంది
స్పృహ తప్పి పడిపోతే బాగుండును కానీ
స్పృహ తప్పి తప్పిపోలేనంత కాంతి
 
కాంతులు దేహాల్ని స్పష్టత పరుస్తున్న
క్షణాల్లో రమించడమూ ఇష్టం
ఎప్పుడూ చీకట్లో అంతమయ్యే చూపులు
పరస్పరం అప్పుడు కళ్ళల్లో ప్రజ్వరిల్లుతాయి
ఆత్మలు కలిసే మార్గం కొంత కష్టమయినా
కిరణం తాకిన క్షణాల్లో సుగమమవుతుంది
 
ఏదైనా తాగొచ్చు
ప్రేమనో సుస్వరాలనో దివ్యాక్షరాలనో...

అసంకల్పిత కల్పన

రెండు వక్షోజాల
          గులాబీ గోపురాల
          తెల్లని వెన్నెల ధారల్ని చూశాను

కరుణ కామంలో మునిగిన
పాలబువ్వల పెదవుల్ని నేనే
దోబూచులాటల చిరుపాదాల్నీ
చిలిపి కళ్ళ శైశవ నిర్మాలిన్యాన్నీ నేనే-

వివశుడ్ని-
చర్మపు మైదానాల్లో
వేలాడే పర్వతాల సానువుల్లో
తల వాల్చిన తమకం లాంటి సాంత్వన సమయాల
                    తపో కాంక్షల వరాల ఫలాలు

పొరబాటున జ్వలించి మరలా సిగ్గుపడ్డ
ఒక శిశ్నం కలిగిన దీర్ఘ హృదయం

పరిసరాల ఆంపశయ్యలు
భర్తలు, భార్యలు, కుటుంబీకులు
సౌందర్యపు వైముఖ్యంలో భద్రతను కల్పించుకున్న శవాలు

చూపులు కలుస్తాయి పరస్పరం
గులాబీ గోపురాలు కుందేలు కొమ్ములవుతాయి
పాల బువ్వల చెయ్యి వొణుకుతుంది
మాతోబాటు లోకమూ వివస్త్ర అయ్యాక
ఇక కల మొదలౌతుంది

చేతి వేళ్ళలో పర్వతాలు నలుగుతాయి
లోయల్లో నా ముఖం ఇరుక్కుని
చెమటలు కారి
ఒక బొడ్డు తెగని పిండమవుతుంది

సిగ్గుపడుతున్న నా పొడవాటి హృదయం మాయమై
ఉమ్మనీరు కమ్ముకున్న ఒక గర్భంలో పునర్జన్మిస్తుంది

నిష్కామ కరుణ

ఎవరు నిర్దయను సాధన చేశారో
వేరెవరు ప్రేమించలేని బలహీనంలో కరిగిపోయారో, తరిగిపోయారో-
పేగుల్లో భస్మమౌతున్న తడి జ్ఞాపకం
రోజూ ఒకే బల్లెపు చూపు గుచ్చుకొని
పగళ్ళు పగిలి
రాత్రుల్లో పడగ్గదుల గోడలకవతల నక్కి
భయం భయంగా తప్పుకొని తిరిగి
ఇల్లు తగలబెట్టుకుంటున్నప్పుడు కసి ఆనందంతో నవ్వి
రాసిందాన్నించి తప్పుకునే క్రతువులో
ద్వేషాన్ని మరింత భరించీ...

తింటున్న కంచాన్నెవరో భళ్ళున నేల పారేస్తారు
తలుపులు పగులుతాయి
గాజు పాత్రల్లో నెత్తుటి వడపోతలు చిల్లుతాయి
నోట్లో ముద్ద పడేసిన చేతుల గాజులు చిట్లుతాయి
ఎవరో ఆగంతుక స్త్రీలూ, పురుషులూ
సోఫాల్లో కూచుని కటువుగా నవ్వుతారు
తింటారు, తాగుతారు, నిద్రపోతారు
నిన్ను నిర్దయగా వాకిట్లోకి గెంటేస్తారు

నడి వీధిలో నిద్రపోతావు
ఎప్పటికీ చేరని ఇల్లుని కలగంటూ ఉంటావు
వాకిట్లోనే నీ పక్కబట్టలూ, మెత్తలూ
ఆ మెత్తల మీద నువ్ కలలుగన్న
                  ఒక పక్కకు ఒరిగిన స్త్రీ సిరస్సూ
తడుస్తుంటాయి ఎండల్లో, వర్షాల్లో-
కవులూ, తత్వవేత్తలూ, వ్యాపారులూ, ప్రవక్తలూ
                                        అందరూ నవ్వుకుంటారు కొంటెగా
నువ్వు లోపల వెలుగుతున్న కరుణ వెలుతురులో స్పృహ తప్పిపోతావు

ఎవరో నీకోసం ఒక వాక్యం రాస్తారు
"ఇక్కడ స్త్రీలు ఎవరూ కరుణను కోరుకోవట్లేదు".

అంతిమ వాంఛ

విశ్రాంతి కావాలి
ఆరడుగుల పృధ్వీ గర్భమో
                       అడుగు మాతృ గర్భమో
ఇంద్రియాలు మూసుకొని
నెత్తురు చల్లబడి, నిలకడై
కడకు నిలిచిపోవాలి మనసూ, కాయమూ
కన్నీరు లేకా, ప్రశ్నలు లేకా
పరుగులు మరుగై, దారులు దగ్ధమై
నిర్దేహమై స్థిరమవ్వాలి
ఒకింత మెల్లనవ్వాలి


విచలిత సౌందర్యాలూ
ముడుతలై శల్యమౌతున్న కాంతి ఛాయలూ
యవ్వనారంభంలో పరుగులిడే కాళ్ళూ, కటి స్థలాలూ
కోర్కెల వైఫల్యాల్లో దుగ్ధమయ్యే నోళ్ళూ
అహంభావ మనస్సులూ
మర్మగర్భ వాంఛలూ
అవాంచిత కరుణలూ, కామ కర్మ కాండలూ
ద్వేషాలూ, ఈర్శ్యలూ, మోసాలూ, అబద్ధాలూ
ఆత్మ ధర్మం గాయమైన జీవన బీభత్సాలూ
కడతేరి పోవాలి. విశ్రాంతి కావాలి


నల్లని కాంతి లాంటి, స్థిరమైన వేగం లాంటి
నిర్ శబ్దం లోకి
అస్వరాల్లోకి, అవర్ణంలోకి. నిరాకారంలోకి
పాదాలు కడపనవసరంలేని ప్రయాణంలోకి
శాంతిలోకి, శాంతిలోకి-

తారు నది

తారు నదిలో కదులుతున్నాను
చిక్కని చీకటి చినుకుల్లో
పడవలో
కదిలీ కదలక
దున్నపోతుల కొమ్ముల మధ్య, కళ్ళ మధ్య, కాళ్ళ మధ్య
విశ్రమించడానికి ఆరడుగుల కోసం వెదుకుతున్నాను
నెత్తురులో ఉబ్బి, పగిలి, పొలుసులు పొలుసులుగా
రాలుతున్న శవాల కాళ్ళ మధ్య తల వాలుస్తున్నాను

పరివ్యాప్తమౌతున్న దుర్వాసన
నెత్తుటి వాన వాసన
కుళ్ళిన కండరాల చిత్తడి
నాలోంచి అవతలికి ఒక్కొక్క పాదం అప్రమత్తతతో మోపుతున్నాను
ఒక కాలు బాల్యంలో
ఒక కాలు వృద్ధాప్యంలో
ఒక జిగురు నిద్రను తునకలు చేస్తున్నాను

దున్నపోతులు పొడుస్తాయి జ్ఞాపకాల్లా
బకెట్లలో శవాలు నవ్వుతాయి సగం తెరిచిన కళ్ళతో
ఎవరో ఏడుస్తున్నారు తారు నది ఒడ్డున
                                 ముసుగులేసుకుంటూ తీసుకుంటూ
ప్రియురాలి నవ్వు పడవలో ప్రతిధ్వనిస్తుంది
ఆమె ఎప్పుడూ కౌమారంలోంచే నవ్వుతుంది ఎముకల్లేకుండా ఎనీమియా కళ్ళతో-
అందం అంత దుర్వాసనలోనూ తెలుస్తుంది
చిగురు పెదవులు విరుగుతాయి విరహంతో
ఒక జీవిత కాలపు విరహం - రహస్యం - క్షమాపణ
కంఠం చుట్టూ తాళి బిగిసిన ఒక స్త్రీ ఊపిరాడక
                               తారు నదిలో మునుగుతుంది పిల్లాజెల్లాలతో-
పడవను కుదిపేసిన ఎర్రని పెదవుల నవ్వు
                               నీలి వర్ణాల్లో మాయమవుతుంది

చీకటి చినుకులు రాలుతూనే వుంటాయి
తారు నది కదులుతూనే వుంటుంది, కదలనట్టుగా-